Jump to content

గద్వాల

వికీపీడియా నుండి

గద్వాల, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలానికి చెందిన పట్టణం.

ఇది జోగులాంబ గద్వాల జిల్లాకు పరిపాలనా కేంద్రం. మండలానికి, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంగా కూడా ఉంది.

పట్టణ స్వరూపం

[మార్చు]
సోమనాద్రి

రెవెన్యూ డివిజన్ కేంద్రమైన గద్వాల పట్టణం డివిజన్‌ లోనే అతిపెద్దది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో ఒకటి. ఇది 16°14′ ఉత్తర అక్షాంశం, 77°48′ తూర్పు రేఖాంశంపై ఉంది.

గణాంకాలు

[మార్చు]

పట్టణ జనాభా

[మార్చు]
కృష్ణారెడ్డి బంగళా

2001 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 53,601. ఇందులో పురుషుల సంఖ్య 51%, స్త్రీల సంఖ్య 49%. ఇక్కడి సగటు అక్షరాస్యత 57% (పురుషుల సంఖ్యలోలో 67%, మహిళలలో 48%). జనాభాలో 13% వయస్సు 6 సంవత్సరాలలోపు ఉంటుంది.

పరిపాలన

[మార్చు]

గద్వాల పట్టణం పరిపాలన పురపాలక సంఘం ద్వారా నిర్వహింపబడుతుంది. 1952లో ఏర్పాటు చేయబడిన పురపాలక సంఘం అప్పటి నుండి మూడవగ్రేడు పురపాలక సంఘంగా ఉండగా, ఫిబ్రవరి 2009లో ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా రెండవ గ్రేడు పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేయబడింది. ప్రస్తుతం ఏటా కోటి రూపాయల ఆదాయం ఆస్తిపన్ను, నీటిపన్నుల ద్వారా పురపాలక సంఘానికి లభిస్తుంది. ప్రభుతం నుంచి లభిస్తున్న నిధులతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

రవాణా

[మార్చు]
గద్వాల రైల్వే స్టేషను
రైలు సౌకర్యం

గద్వాల రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో హైదరాబాదు - కర్నూలు మధ్య హైదరాబాదు నుంచి దక్షిణముగా 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ వైపు వెళ్ళడానికి రోడ్డు మార్గంలో దూరం అధికంగా ఉన్నందున రైలు ప్రయాణం చాలా అనువుగా ఉంది. ఇక్కడి నుంచి కర్ణాటక లోని రాయచూరుకు నూతనంగా రైలుమార్గం ఏర్పాటుచేశారు. ప్రతి రోజు సికింద్రాబాద్ నుండి రాయచూర్‌కు డెమో రైలు ఈ మార్గం గుండా తిరుగుతుంది. ఈ మార్గం ఏర్పడ్డాకా గద్వాల జంక్షన్‌గా మారింది. వ్యాపారపరంగా కూడా గద్వాల పట్టణం మరింత అభివృద్ధి చెందటానికి ఈ మార్గం దొహదపడుతుందని ప్రజలు భావిస్తున్నారు.

రోడ్డు రవాణా
గద్వాల పట్టణంలోని రాజీవ్ రహదారి

గద్వాల పట్టణం 7వ నెంబరు జాతీయ రహదారికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాదు - కర్నూలు మార్గంలో జాతీయ రహదారిపై కృష్ణా నది వంతెన దాటిన కొద్దిదూరంలో ఉన్న ఎర్రవల్లి కూడలి నుంచి కుడివైపున వెళ్ళవలసి ఉంటుంది. కృష్ణానదిపై మరో వంతెన లేనందున వంతెన దాటి గద్వాల వెళ్ళడం హైదరాబాదు, మహబూబ్ నగర్ నుంచి వచ్చు వాహనాలకు దూరం అధికం అవుతుంది. గద్వాల నుంచి కర్నూలు, వనపర్తి, అయిజా, ఆత్మకూరు, కొల్లాపూర్, కర్ణాటకలోని రాయచూరు పట్టణాలకు బస్సు సౌకర్యాలు బాగుగా ఉన్నాయి. గద్వాలలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో కూడా ఉంది. ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని 8 డీపోలలో ఒకటి. పరిసర ప్రాంతాలలోని బస్సుస్టేషనుల నిర్వహణ ఈ డిపో ద్వారానే జరుగుతుంది.

చారిత్రక విశేషాలు

[మార్చు]
గద్వాల కోట లోపల మాజీ సంస్థానాధీశులు నిర్మించిన చెన్నకేశ్వస్వామి ఆలయం

1663 సంవత్సరం నుండి 1712 మధ్యకాలంలో పెద సోమభూపాలుడు (ఇతనినే నలసోమనాద్రి అనేవారు) పూడూరు రాజధానిగా పరిపాలించేవాడు. పూడూరు కోటను మరమ్మత్తు చేస్తుండగా గుప్తనిధి లభించగా, శత్రు ధుర్భేధ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గద్వాలలో మట్టి కోటను కట్టించాడు. కోట నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు రావడముతో కేశవాచారి అనే బ్రాహ్మణుడిని బలి ఇచ్చారని, ఆ పాప పరిహారానికి గాను గద్వాల కోటలో చెన్నకేశవ దేవాలయాన్ని నిర్మించారని కథ ప్రచారంలో ఉంది. చెన్నకేశవ స్వామి ఆలయాన్ని

నిర్మించిన తరువాత రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చాడు. గద్వాల సంస్థానాధీశులకు చెన్నకేశవ స్వామి కులదైవం.

1709 నుండి 1712 వరకు కర్నూలు దుర్గం రాజా పెదభూపాలుని ఆధీనంలో ఉండేది. బహద్దూర్ షా అనుయాయులు గద్వాల రాజు ఆధీనంలో ఉన్న కర్నూలు దుర్గాన్ని స్వాధీనం చేసుకోవడానికి నిజాం తన సేనాని దిలీప్ ఖాన్ ను పంపించాడు. దిలీప్ ఖాన్ కు పెద సోమభూపాలునికి మధ్య కర్నూలు సమీపంలోని నిడదూరు గ్రామం దగ్గర జరిగిన యుద్ధంలో రాజా పెదసోమభూపాలుడు జ్యేష్ట శుక్ల అష్టమి రోజు మరణించాడు. నిజాం గద్వాల సంస్థానాన్ని వశం చేసుకోకుండా పెద్దసోమభూపాలుని భార్య లింగమ్మతో సంధిచేసుకొనడంతో నిజాం రాజ్యంలో గద్వాల స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. అప్పటి నుంచి 1948లో నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యేవరకు గద్వాల సంస్థానం కొనసాగినది.

సంస్థానాల కాలం నాటి గద్వాల మట్టికోట

పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన యుద్ధంలో పెదసోమభూపాలుడు గదను, వాలమును ప్రయోగించడం వలన ఈ కోటకు "గదవాల (గద్వాల)" అనే పేరు వచ్చిందని చెబుతారు.[1] ఈ విధంగా 1663 నుండి 1950 వరకు గద్వాల సంస్థానాధీశులచే పరిపాలింపబడింది. రాజాభరణాల రద్దు తరువాత ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, తరువాత 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాలను కోటలోపల ఏర్పాటు చేసారు. డిగ్రీ కళాశాల పేరు కూడా రాణి పేరు మీదుగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (మాల్డ్) డిగ్రీ కళాశాలగా పెట్టబడింది.

కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం

[మార్చు]

జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా గద్వాల పట్టణంలో 1.39 లక్షల చదరపు మీటర్లలో 51.18 కోట్ల రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు పైన రెండు అంతస్తులు ఉండేలా 46 గదులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. వివిధ శాఖలకు చెందిన 36 జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కింది అంతస్తులో కలెక్టర్‌, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలు, రెండు వెయిటింగ్‌ హాల్స్‌, రెండు వీడియోకాన్ఫరెన్స్‌ హాల్స్‌, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులు, దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్‌ హాల్‌ను నిర్మించారు. మొదటి అంతస్తులో వివిధ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇతర ముఖ్య అధికారులు ఉండేలా దీనికి సమీపంలో ఎనిమిది నివాస భవనాలు నిర్మించబడ్డాయి. కలెక్టరేట్‌ ముందు భాగంలో కాకతీయుల కాలంనాటి స్తంభాలు, కార్యాలయ ఆవరణలోని గార్డెనింగ్‌ నిర్మించారు.[2]

2023, జూన్ 12న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్‌ వల్లూరి క్రాంతిని కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌, డీజీపీ అంజనీకుమార్‌, జడ్చర్ల ఎమ్మెల్యే సి. లక్ష్మారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే వి.ఎం. అబ్రహం, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[3]

ఎస్పీ కార్యాలయం

[మార్చు]

38.50 కోట్ల రూపాయలతో గద్వాల జిల్లా పోలీస్‌ కార్యాలయ సముదాయం నిర్మించబడింది. కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వహించేందుకు నాలుగు ఫోర్లు, 45 గదులు, సమీక్ష సమావేశాల కోసం కాన్ఫరెన్స్‌హాల్‌, ప్రత్యేక క్యాబిన్‌, సాయుధ దళపతి కార్యాలయంతోపాటు ఆర్మ్‌డ్‌ సిబ్బంది ఉండేలా రెండు బరాక్‌లు, ల్యాబ్‌ సౌకర్యం, ఫోరెన్సిక్‌, సైబర్‌, క్లూస్‌టీం కోసం సైతం వసతులు, డాగ్‌, బాంబ్‌ స్కాడ్‌ సిబ్బందికి వసతి వంటివి ఏర్పాటు చేయబడ్డాయి. 2023, జూన్ 12న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోలీస్‌ కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించాడు.[4]

విద్య

[మార్చు]

పి.జి.కళాశాలల

[మార్చు]
గద్వాల బస్సుస్టేషను
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ కళాశాల: గతంలో ఉస్మానియా యూనివర్సిటికి అనుబంధంగా గద్వాలకు పి.జి. కళాశాల మంజూరైంది. తొలినాళ్ళలో ఎం.సి.ఏ. కోర్సు మాత్రమే ఉండేది. డి.కె. సత్యారెడ్డి బంగ్లాలో కొద్ది కాలం కళాశాల నడుపబడింది. తరువాత పట్టణానికి ఉత్తరాన ఉన్న అగ్రహారం గ్రామ సమీపాన కళాశాల నూతన భవనాన్ని నిర్మించాకా కళాశాల అక్కడికి మార్చబడింది. తదనంతర కాలంలో ఎం.సి.ఏ. కోర్స్‌కు డిమాండ్ లేకపోవడంచే విద్యార్థులెవరు చేరకపోవడం వలన కళాశాల మూతపడింది. కళాశాలలోని కంప్యూటర్లు పాడైపోతుంటే, పాలమూరు యూనివర్సిటి ఏర్పడ్డాకా మహబూబ్ నగర్‌కు తరలించారు. ఇక్కడి విద్యావసరాలు గుర్తించి, విద్యార్థులు పి.జి. కళాశాల గురుంచి మళ్ళీ ఉద్యమించగా గద్వాల సాహిత్య నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, పాలమూరు యూనివర్సిటికి అనుబంధంగా తెలుగు కోర్సును ప్రవేశపెట్టారు. తరువాత మరో రెండు భాషల కోర్సులను కూడా ప్రవేశపెట్టారు.
  • ఎస్.వి.యం. పి.జి. కళాశాల: ఈ కళాశాలలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన కోర్సులు ఉన్నాయి.

డిగ్రీ కళాశాలలు

[మార్చు]
  • మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
  • నిషిత డిగ్రీ కళాశాల

జూనియర్ కళాశాలలు

[మార్చు]
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల
  • సోమనాద్రి జూనియర్ కళాశాల: ఇది గద్వాల పట్టణంలో మొదటి ప్రైవేట్ జూనియర్ కళాశాల.
  • జ్ఞానప్రభ జూనియర్ కళాశాల
  • ఎస్.వి.యం.జూనియర్ కళాశాల
  • కృష్ణవేణి జూనియర్ కళాశాల

వృత్తి విద్యా కళాశాలలు

[మార్చు]
  • సెయింట్ థామస్ బి.ఇ.డి.కళాశాల: ఇది గద్వాల పట్టణంలో తొలి వృత్తివిద్యా కళాశాల
  • సెయింట్ థామస్ టి.టి.సి. కళాశాల
  • భవాని హిందీ పండిట్ కళాశాల
  • కృష్ణవేణి తెలుగు పండిట్ కళాశాల

సాంకేతిక విద్యా కళాశాలలు

[మార్చు]
  1. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల: ప్రస్తుతం కె.ఎల్.ఐ. అతిథి గృహం సమీపాన ఈ కళాశాల నడుపబడుతున్నది. గద్వాలకు పశ్చిమాన మూడు కిలోమీటర్ల దూరంలో, గోనుపాడ్ గ్రామ సమీపాన నూతన భవనాన్ని నిర్మించారు. ఇటీవల గద్వాల శాసనసభ్యురాలు డి.కె. అరుణ నూతన భవనాన్ని ప్రారంభించారు. కళాశాల నూతన భవనంలోకి మార్చవలసి ఉంది.
  2. ఫాతిమా ఐ.టి.ఐ. కళాశాల: జ్ఞానప్రభ జూనియర్ కళాశాల యాజమాన్యంలో నడుపబడుతున్న ప్రైవేట్ కళాశాల.
  3. శ్రీరాజరాజేశ్వరి ఐ.టి.ఐ. కళాశాల, మేళ్ళచెర్వు రోడ్, గద్వాల

ప్రభుత్వ పాఠశాలలు

[మార్చు]
  1. ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలురు),గంజిరోడ్.
  2. ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలికలు), పాత బస్టాండు.
  3. ప్రభుత్వ అభ్యసోన్నత పాఠశాల, పోలీస్ క్వాటర్స్
  4. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బుర్దపేట
  5. ప్రభుత్వ ఉన్నత పఠశాల, మోమిన్‌మహల్లా

ప్రైవేట్ పాఠశాలలు

[మార్చు]
  1. శ్రీసరస్వతీ విద్యామందిరం, గంజిపేట
  2. నేతాజీ విద్యామందిర్, షేర్ అలీ వీధి
  3. దయానంద విద్యామందిర్, వేదనగర్
  4. ప్రగతి విద్యానికేతన్, ఒంటెలపేట
  5. శ్రీశారదా విద్యానికేతన్, అగ్రహారం
  6. నవోదయ ఉన్నత పాఠశాల, నల్లకుంట

విశేషాలు

[మార్చు]

గద్వాల చేనేత చీరలకు ప్రసిద్ధి చెందింది, ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం కూడా. పట్టణం నడిబొడ్డున సంస్థానాధీశుల కాలం నాటి పూర్తిగా మట్టితో నిర్మించిన కోట ఉంది. గద్వాల సమీపంలో ఆత్మకూరు వెళ్ళు రహదారిలో "ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు" ఉంది. 7వ నెంబరు జాతీయ రహదారి నుండి 18 కిలోమీటర్లు లోపలికి ఉన్న గద్వాల పట్టణానికి రైలు మార్గం ఉంది. దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన గద్వాల సంస్థానం చరిత్ర పట్టణానికి ఉంది. గద్వాల సమీపంలోని పలు గ్రామాలు కూడా చారిత్రక ప్రాశస్త్యం కలవి. గద్వాల మండలములోని పూడూరును రాజధానిగా చేసుకొని పాలించిన చరిత్ర ఉంది. అయిజా, రాజోలి, వేణిసోంపూర్, ఆలంపూర్ తదితర గ్రామాలు కూడా చారిత్రకంగా, పర్యాటకంగా ప్రఖ్యాతిగాంచినవి. కళలకు నిలయంగా బాలభవన్ విరాజిల్లుతోంది. దీనిని 1982లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడైన పాగ పుల్లారెడ్డి ఏర్పాటుచేశాడు. వందేమాతరం రామచంద్రారావు, వీరభద్రారావు, పాగపుల్లారెడ్డి, లడ్డుభీమన్న లాంటి ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధులు ఈ పట్టణానికి చెందినవారే. రాజకీయంగా కూడా గద్వాల ప్రముఖస్థానం పొందింది. గతంలో రాష్ట్ర మంత్రిపదవి నిర్వహించిన సమరసింహారెడ్డి, డి.కె.అరుణ గద్వాల పట్టణంనకు చెందినవారు.

చేనేత పరిశ్రమ

[మార్చు]

చేనేత పరిశ్రమలో ముఖ్యంగా చీరల తయారీలో గద్వాల పట్టణం జిల్లా లోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రముఖ పేరు సంపాదించింది. ఇక్కడి నుంచి ప్రముఖ పట్టణాలకు వస్త్రాలు ఎగుమతి అవుతుంటాయి. చేనేత వస్త్రాలకు డిమాండు తగ్గిననూ అతినాణ్యత కల జరీ చీరలు నేసే కళాకారులు గద్వాలలో ఇప్పటికీ ఉన్నారు. బ్రిటీష్ కాలంలో చేనేత కళాకారులకు ఎలాంటి ప్రోత్సాహం లభించకున్ననూ సంస్థానాధీశులు మాత్రం వీరిని ప్రోత్సహించారు. గద్వాల సంస్థానాధీశుల కాలంలో అప్పటి మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గద్వాల నుంచి ఇద్దరు చేనేత కళాకారులను ఉత్తర ప్రదేశ్ లోని వారణాసికి పంపించి బనారస్ జరీ చీరలను నేసేందుకు శిక్షణ ఇప్పించింది.[5]

తిరుమలేశునికి గద్వాల పంచెలు

[మార్చు]

సుమారు నాలుగు శతాబ్దాలుగా గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి పంచెలను సమర్పించే సంప్రదాయం ఉంది. నాటి రాజు సీతారాం భూపాల్ గద్వాల సంస్థానాధీశుల ఇష్టదైవమైన వెంకటేశ్వరస్వామివారికి పంచెలను సమర్పించే పద్ధతిని ప్రవేశపెట్టాడు.[6] అతని వారసులు నేటికికూడా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు.

చారిత్రక కోట

[మార్చు]

గద్వాల పట్టణం నడొబొడ్డున ఉన్న చారిత్రకమైన పూర్తిగా మట్టితో కట్టబడిన కోటను పెద్ద సోమభూపాలుడు సా.శ.1662లో నిర్మించాడు.[7] ఇతనికే నల్ల సోమనాద్రి అనే పేరు కూడా ఉంది. ఇదే కోటలో చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సోమనాద్రియే అత్యంత సుందరంగా నిర్మించాడు. దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపురులను ఆకట్టుకుంటాయి. కోట లోపల ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల నడుస్తున్నవి.

సాహిత్యం

[మార్చు]

గద్వాల సంస్థానాధీశులు సాహితీప్రియులు కావడంతో వీరి కాలంలో సాహిత్యం బాగా అభివృద్ధి చెందినది. తిరుపతి వేంకట కవులు కూడా గద్వాల సంస్థానాన్ని సందర్శించారు. కోటలో తరుచుగా సాహిత్య సభలు జరిగేవి. కవులకు సంస్థానాధీశులు బహుమతులను కూడా అందజేసేవారు. చినసోమభూపాలుని హయాంలో అష్టదిగ్గజాలనే 8మంది కవులుండేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది.

బాలభవన్

[మార్చు]

కళలకు నిలయంగా గద్వాల పట్టణం నడిబొడ్డున ఉన్న బాలభవన్ విరాజిల్లుతోంది. దీనిని 1982లో ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు, మాజీ శాసనసభ్యుడైన పాగ పుల్లారెడ్డి ఏర్పాటుచేశాడు.[8] 1985లో ఆంధ్రనాటక ప్రముఖుడైన నటరాజ రామకృష్ణ పాఠశాలలోని కళాశాకారుల ప్రతిభను గుర్తించాడు. 1990లో హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి బాలల రంగస్థల ఉత్సవాలలో పాల్గొని గద్వాల విద్యార్థులు ప్రథమ బహుమతిని పొందినారు. రాష్ట్రంలో ఏ బాలభవన్‌కు లేని ప్రత్యేకతలు గద్వాల బాలభవన్‌కు ఉన్నాయి. ఏకకాలంలో 600 ప్రేక్షకులు తిలకించడానికి అవకాశం ఇక్కడ ఉంది. 2000లో మినీ థియేటర్‌ను, 2004లో అర్ట్‌గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ ఏటా 700 మంది సంగీతం, వాయిద్యం, నృత్యం, చిత్రలేఖనం, కుట్లు, అల్లికలు వంటి విభాగాలలో శిక్షణ పొందుతున్నారు.

గద్వాల మార్కెటింగ్ కమిటి

[మార్చు]

పరిసర ప్రాంతాల రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా 1974లో గద్వాల పట్టణంలో అయిజా వెళ్ళు మార్గములో మార్కెంటింగ్ కమిటీని ఏర్పాటుచేశారు. ప్రారంభంలో ఏటా 24 లక్షల ఆదాయం ఉండేది. కాలక్రమేణా ఆదాయం పెరిగి 2006-07లో కోటి రూపాయల ఆదాయం దాటింది. 2008-09 నాటికి వార్షిక ఆదాయము కోటి 60 లక్షలకు చేరింది. ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని 18 మార్కెటింగ్ కమిటీలలో ఒకటి, గద్వాల డివిజన్‌లో పెద్దది. 2009లో పత్తి మార్కెట్ కూడా ప్రారంభించబడింది.

సమీపంలోని పర్యాటక ప్రదేశాలు

[మార్చు]
జమ్ములమ్మ దేవాలయం
  • గద్వాల కోట: ఈ కోట గద్వాల పట్టణం నడొబొడ్డున ఉంది. పూర్తిగా మట్టితో కట్టబడిన ఈ కోట ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్ననూ పర్యాటక ప్రదేశంగానూ గుర్తింపు పొందింది. ఇక్కడ సినిమా షూటింగులు కూడా నిర్వహించారు
  • ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు: గద్వాల నుంచి ఆత్మకూరు వెళ్ళు మార్గంలో మహబూబ్ నగర్ జిల్లాలోనే పెద్దదైన ఈ ప్రాజెక్టు కృష్ణానదిపై ఉంది.
  • చంద్రగఢ్ కోట: చంద్రసేనుడు నిర్మించిన చంద్రగఢ్ కోట జూరాల ప్రాజెక్టు సమీపంలో ఎత్తయిన కొండలపై ఉంది. కోటలోపల శివాలయాలున్నాయి.

ఆలయాలు పవిత్ర స్థలాలు

[మార్చు]
  • *జమ్ములమ్మ దేవాలయం: గద్వాల పట్టణం నుంచి 7వ నెంబరు జాతీయ రహదారికి వెళ్ళు మార్గంలో గద్వాల నియోజకవర్గంలోనే ప్రముఖమైన జమ్ములమ్మ దేవాలయం ఉంది. దేవాలయం ప్రక్కనే పెద్ద చెరువు కూడా ఉంది. చల్లని గాలులు, సుందర ప్రకృతి దృశ్యాలు భక్తులను ఆకట్టుకుంటాయి.
  • కృష్ణా అగ్రహారం: కృష్ణా పుష్కరాల సమయంలో అనేక వేల భక్తులు వచ్చి పవిత్ర స్నానమాచరించే కృష్ణాఅగ్రహారం గద్వాల పట్టణం సమీపంలోనే ఉంది. రైలు మార్గం ద్వారా కృష్ణానది వంతెన దాటునప్పుడు పుష్కర స్థలం కనిపిస్తుంది
  • మల్దకల్ లో శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం
  • సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం:

గద్వాల - కొన్ని విషయాలు

[మార్చు]
  • మండలంలోని గ్రామపంచాయతీలు: 25
  • శాసనసభ నియోజకవర్గం; గద్వాల్ శాసనసభ నియోజకవర్గం.
  • లోక్‌సభ నియోజకవర్గం; నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం.
  • మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపిపి): సుభాన్. ఇతను మేళ్ళచెరువు గ్రామ వాసి.
  • జడ్పీటీసి: బండారి భాస్కర్. ఇతనే మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మెన్‌గా ఎన్నికయ్యాడు.
  • ఎస్టీడి కోడ్: 08546
  • గద్వాల పోస్టల్ పిన్ కోడ్: 509125
  • మండల సెన్సెస్ కోడ్: 0055
  • ముఖ్యమైన పంట: వరి, పత్తి, వేరుశనగ

ఇటీవలి సంఘటనలు

[మార్చు]
  • 2013, అక్టోబరు 12: నూతనంగా నిర్మించిన గద్వాల- రాయచూర్ రైలుమార్గం ప్రారంభమైంది.
  • 2010, అక్టోబరు 20: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం తొలి శాసనసభ్యుడు, పురపాలక సంఘం చైర్మెన్‌గా, మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పనిచేసిన పాగపుల్లారెడ్డి మరణం.[9]
  • 2010, జూన్ 14: మహారాజ కూరగాయల మార్కెట్‌లో పాత దుకాణాలు కూలి 10 మంది మరణించారు.[10]
  • 2009 ఫిబ్రవరి: గద్వాల పురపాలక సంఘం మూడవ గ్రేడు నుంచి రెండవ గ్రేడుకు మార్చబడింది.
  • 2006 ఫిబ్రవరి: రాష్ట్రస్థాయి బాలల రంగస్థల ఉత్సవాలు నిర్వహించబడ్డాయి.
  • 1952: పురపాలక సంఘము ఏర్పాటుచేయబడింది.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
వందేమాతరం రామచంద్రారావు
ఇతని అసలుపేరు రామచంద్రయ్య. తరువాత రామచంద్రారావుగా మార్చుకున్నాడు. మొదట గద్వాల రాజు సీతారాం భూపాల్ చెల్లెలు వద్ద గుమాస్తా పనిచేసి, పుల్లారెడ్డితో కలిసి హైదరాబాదులో విద్యనభ్యసించి గద్వాల సంస్థానంలో సబ్‌ఇన్స్‌పెక్టర్‌గా నియమితులయ్యాడు.ఆ పిమ్మట ఉద్యోగాన్ని వదిలి హిందూమహాసభలో చేరినాడు. పోలీసు చర్య ముందు రజాకారుల రహస్యాలను చేరవేసే గూఢచారిగా పనిచేశాడు. వందేమాతరం ఉద్యమంలో పనిచేస్తూ నిజాం పోలీసులకు పట్టుపడి జైలుశిక్ష అనుభవించాడు. విచారణ సమయములో పేరు, ఊరు విషయాలన్నింటికీ వందేమాతరం అని సమాధానం ఇచ్చాడు. జైలు నుంచి విడుదలైన పిమ్మట అందరూ ఇతన్ని వందేమాతరం రామచంద్రారావుగా పిలవడం మొదలుపెట్టారు. స్వాతంత్ర్యం తరువాత శాసనసభ్యుడిగా పనిచేశాడు. ఇతని సోదరుడు వీరభద్రారావు కూడా స్వాతంత్ర్యసమరయోధుడు.
పాగ పుల్లారెడ్డి
స్వాతంత్ర్య సమరయోధుల జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన[11] పాగ పుల్లారెడ్డి మహాత్మాగాంధీ స్పూర్తితో జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడై అనేక ఉద్యమాలలో పాలుపంచుకున్నాడు. స్వాతంత్ర్యానంతరం రాజకీయాలలొ అనేక పదవులు పొంది గద్వాల పట్టణానికి సేవలందించాడు. 1972లో గద్వాలలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఘనత కూడా ఇతనిదే. 1972 శాసనసభ ఎన్నికలలో డి.కె.సత్యారెడ్డిపై విజయం సాధించి ఆరేళ్ళపాటు శాసనసభ్యుడిగా కొనసాగినాడు. పురపాలక సంఘం చైర్మెన్‌గా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశాడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. అక్టోబరు 20, 2010న మరణించాడు.[12]
లడ్డు భీమన్న
స్వాతంత్ర్య సమరయోధుడైన లడ్డు భీమన్న గద్వాల వాసి. స్వాతంత్ర్య ఉద్యమసమయంలోనూ, విమోచన ఉద్యమంలోనూ గద్వాల ప్రాంతంలో ముఖ్యపాత్ర వహించాడు. 2008, ఫిబ్రవరి 28న మరణించాడు.
సమర సింహారెడ్డి
నాలుగు సంవత్సరాలకు పైగా రాష్ట్ర మంత్రిగా, 14 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా పనిచేసిన సమర సింహారెడ్డి గద్వాలకు చెందిన రాజకీయ నాయకుడు. 1979 నుంచి 1994 వరకు గద్వాల శాసనసభ నియోజకవర్గం తరఫున శాసనసభ్యుడిగా వ్యవహరించాడు. 1994లో స్వంత తమ్ముడు భరత సింహారెడ్డి చేతిలో ఓడిపోయిన తరువాత అధికార పదవులకు దూరమైనాడు. గద్వాల నియోజకవర్గపు మాజీ శాసనసభ్యురాలు డి.కె.అరుణ ఇతని మరదలు.
భరత సింహారెడ్డి
సమరసింహారెడ్డి సోదరుడైన భరత సింహారెడ్డి గద్వాల పట్టణపు రాజకీయనేతలలో ఒకడు. 1994 శాసనసభ ఎన్నికలలో :సమర సింహారెడ్డిపై 32 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించాడు. ప్రస్తుతం గద్వాల నియోజకవర్గం శాసనసభ్యురాలైన డి.కె.అరుణ ఇతని భార్య.
డి.కె.అరుణ
స్వాతంత్ర్యసమరయోధుడు, రాజకీయవేత్త, 2005, ఆగష్టు 15న నారాయణ పేటలో నక్సలైట్ల తూటాలకు బలైన నర్సిరెడ్డి కూతురైన డి.కె. అరుణ గద్వాల నియోజకవర్గపు మాజీ శాసనసభ్యురాలు. 2004లో తొలిసారి విజయం సాధించగా, 2009లో మళ్ళీ శాసనసభ్యురాలిగా ఎన్నికై రాష్ట్రమంత్రివర్గంలో స్థానం పొందినది.[13] 2014లో తిరిగి శాసనసభ్యురాలుగా ఎన్నిక అయింది. 2019లో తన సమీప బంధువైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయింది.
పట్నం శేషాద్రి
ఇతడు కవితాసుమాలు, అక్షరదళాలు, విచిత్ర వర్ణాలు అనే పుస్తకాలను వెలువరించిన కవి.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, గద్వాల్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే. అరుణ పై 51,687 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము-2, 1962 ప్రచురణ, పేజీ 304
  2. telugu, NT News (2023-06-12). "CM KCR | జోగులాంబ గద్వాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-13. Retrieved 2023-06-13.
  3. "గద్వాలపై వరాల జల్లు". EENADU. 2023-06-13. Archived from the original on 2023-06-13. Retrieved 2023-06-13.
  4. telugu, NT News (2023-06-12). "CM KCR | గద్వాల ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-13. Retrieved 2023-06-13.
  5. ఆంధ్రప్రభ దినపత్రిక, మహబూబ్ నగర్ ప్రత్యేక అనుబంధం (2006), పేజీ 36,
  6. సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 8, తేది 05.09.2008
  7. ఆంధ్రప్రభ తృతీయ వార్షికోత్సవ మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక అనుబంధం (2006), పేజీ 12
  8. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేదిమ్29-04-2010
  9. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 21.10.2010
  10. ఈనాడు దినపత్రిక, తేది 15-06-2010
  11. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 10, తేది 15-08-2008
  12. ఈనాడు దినపత్రిక, తేది 21.10.2010
  13. ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009

వెలుపలి లింకులు

[మార్చు]