విద్వాన్ అన్నవారపు వెంకట రాఘవశాస్త్రి
విద్వాన్ అన్నవరపు వేంకట రాఘవశాస్త్రి (శుభకృత్ 1841 లేదా 42-మరణం 1927సంవత్సరం). వెంకట రాఘవశాస్త్రి గారి తాతగారు వెంకటాద్రి శాస్త్రి పౌరాణికులు, తండ్రి సుబ్రహ్మణ్య సిద్ధాంతి జ్యోతిష విద్వాంసులు. తల్లి లక్ష్మమ్మ ఒంగోలులో ప్రసిద్ధ కుటుంబం ధారావారి ఆడపడుచు. వీరి స్వస్థలం ఒంగోలుజిల్లా కొత్తపట్టణం, ఈయన ఇంగువ వెంకట రామశాస్త్రి, ఇంగువ పట్టాభి రామశాస్త్రి వద్ద కావ్య నాటకాదులు చదివి, కాశీ వెళ్ళి విద్యాభ్యాసం చేశారు. తొలిభార్య చనిపోతే, ధారావారి అమ్మాయిని చేసుకొన్నారు. కంచివెళ్ళి ఎంబారు జియ్యరు స్వామి సన్నిధిలో శాస్త్రాలు చదివారు, కంచిలో శ్రీరంగ నారాయణ జియ్యరు సన్నిధిలో శ్రీ రామానుజ భాష్యాదులు అభ్యసించాలని అభిలషించారుగానీ, ఈయన శ్రీ వైష్ణవులు కారు కనుక ఆ కోరిక తీరలేదు. కుంభకోణం సమీపంలోని తిరువిశ నల్లూరు గ్రామంలో మహా మహోపాధ్యాయ రామసుబ్రహ్మణ్యశాస్త్రులను ఆశ్రయించమని కంచిలో నారాయణ జియ్యరు సలహా ఇచ్చారు. వెంకట రాఘవశాస్త్రి సుబ్రహ్మణ్యశాస్త్రుల వద్ద శంకరభాష్యం, వాచస్పత్యం, తదితర అద్వయిత గ్రంథాలు అధ్యయనం చేశారు, మహా పండితుల సన్నిధిలో ఉభయ మత సిద్ధాంతాలను బోధపరచుకొని, 1880 ప్రాంతంలో కొత్తపట్నం తిరిగివచ్చారు. అక్కడ "సీ కష్టం ఆఫీసు"లో పనిచేస్తున్న ఒంగోలు వెంకట రంగయ్య పంతులు వీరి ప్రథమ శిష్యులై, రెండు మూడు ఏళ్ళపాటు వేదాంతం చదివారు. ఆ తర్వాత అక్కడ అనేకమంది ఆయన వద్ద వేదాంతం చదువుకొన్నారు. రాఘవశాస్త్రి గొప్ప బోధకులు, ఎంత జటిల విషయాన్నయినా వివరించే ప్రగ్జ కలిగినవారు. ఈయన 1905 లో నెల్లూరులో స్థిరపడి, 1910 నుండి నెల్లూరు కాశిఖేలవారివీధిలోని వేదాంతమందిరంలో 1927 లో మరణించేవరకూ వేదాంత ప్రవచనం చేశారు. 1915 లో కాశిఖేలవారివీధిలో ఇల్లుకొన్నారు. 1918లో పూరీయాత్ర చేసి, చైతన్య మతం వంక ఆకర్షితులయ్యారు. తిరువశై రామసుబ్బాశాస్త్రి త్రిమత భాష్యాలూ బోధిస్తూ, శంకరులు విష్ణభక్తులని, చైతన్య భక్తిని ప్రచారంచేస్తూ, చాలామంది పండితులను నామాలు ధరించేటట్లు చేశారట. వీరి శిష్యరికంలో రాఘవాచార్యులు చైతన్య భక్తులై, ఆ మతం స్వీకరించి చందన నామాలు ధరించి, దక్షిణదేశ యాత్ర చేసి, నెల్లూరులో ఏటా చైతన్యస్వామి జయంతి జరిపేవారు. 1893లో నెల్లూరులో ప్రచురణ పొందిన శారీరక న్యాయ సంగ్రహం శాస్త్రి గారిదని అంటారు, కానీ అందులో రచయిత పేరు లేదు. “బ్రహ్మ సూత్రార్థదీపికా” ఆయనరచనని అంటారు కానీ ముఖపత్రంమీద పేరు లేదు. ఆయన “శ్రీ చైతన్య లీలాసుధానిధి” పేర 3219 శ్లోకాలతో ఒక గ్రంథం రచించారు. ఇందులో ప్రథమలీల, మధ్యమలీల, అంత్యలీల అని మూడు స్కంధాలు. ప్రథమలీల 19 వ సర్గలో రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని వివరించే అంతర్ నాటకం ఉంది. 1920 -22 మధ్యకాలంలో ఈ గ్రంథరచన తెలుగులిపిలో చేశారు. తర్వాత శిష్యులు కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి దానికి ఒక నకలు రాశారు. రాఘవశాస్త్రి కుమారులు నాగరలిపిలో మరొక ప్రతి తయారుచేశారు. రాఘవశాస్త్రి సహాయంతో అనేక గ్రంథాలు ఆచ్చయినా ఆయన ఈ రచన మాత్రం అచ్చుకాలేదు. దక్షిణదేశంలో చైతన్య చరిత్రకు సంబంధించిన తొలి గ్రంథం ఇదే అని అంటారు. కాళిదాసు వెంకట సుబ్బాశాస్త్రి వంటి అనేకమంది పండితులు వీరివద్ద చదువుకున్నారు. వీరి సంతాపసభ నెల్లూరు వేద సంస్కృత పాఠశాలలో 28-8-1927 సాయంత్రం జరిగింది. మూలాలు: 1. రాఘవశాస్త్రి సంతాపసభ వార్త వివరంగా దేశబంధు 5-9-1927, సంచిక, పుట 905 లో ఉంది. 2. జమీన్ రైతు వారపత్రిక 8-10-1976 సంచికలో పెననేపల్లి గోపాలకృష్ణ వ్యాసం. 3. ఒంగోలు వెంకటరంగయ్య గ్రంథం “ కొందరు నెల్లూరు గొప్పవారు”