కొంకణ్ రైల్వే భారత పశ్చిమ తీరం వెంట ఉన్న రైలుమార్గం. దీన్ని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ నిర్మించి, నిర్వహిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం నవీ ముంబైలోని CBD బేలాపూర్‌లో ఉంది. ఈ రైల్వేకు చెందిన 756.25 కి.మీ. (469.91 మై.) పొడవైన రైలు మార్గం మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల గుండా వెళ్తుంది. రైలుమార్గం మొత్తం నిర్మాణం పూర్తయ్యాక, మొట్ట మొదటి రైలు 1998 జనవరి 26 న నడిచింది. [1] ఈ రైల్వేకు చెందిన మొదటి ప్రయాణీకుల రైలు 1993 మార్చి 20 న ఉడిపి, మంగళూరుల మధ్య (పూర్తి మార్గంలో కాదు) నడిచింది. ఈ రైల్వే మొదలైన కొత్తలో పర్వత మయమైన కొంకణ్ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగడంతో కొంకణ్ రైల్వే ఓ కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టింది. యాంటీ-కొలిజన్ పరికరాలు, స్కై బస్, రోల్-ఆన్/రోల్-ఆఫ్ వంటి కొత్త ఆవిష్కరణలను కొంకణ్ రైల్వే ప్రవేశపెట్టింది. [2]
కొంకణ్ తీరప్రాంతం లోని నగరాలు, పట్టణాలు, గ్రామాలను కలిపే రైలుమార్గం లేదు. 1947 వరకు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు ఈ మార్గంలో రైలుమార్గాన్ని నిర్మించలేదు. ఆ తరువాత వచ్చిఅన్ స్వతంత్ర భారతంలో కూడా చాలా సంవత్సరాల పాటు రైలుమార్గ నిర్మాణం జరగలేదు. మొదటి సర్వే మాత్రం 1920 లోనే చేసారు. 1957 లో మహారాష్ట్రలోని రాయగఢ జిల్లా లోని దాస్గావ్, కర్ణాటక లోని మంగళూరుల మధ్య ప్రాంతంలో రైలుమార్గ నిర్మాణానికి గల అవకాశాలను అధ్యయనం చేసే లక్ష్యంతో ఏరియల్ సర్వే నిర్వహించారు. [3]
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాంతపు డిమాండ్‌ను వి.పి. సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ నెరవేర్చాడు. అప్పటి ఆర్థిక మంత్రి మధు దండావతే, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు రామకృష్ణ హెగ్డే దానికి మద్దతు ఇచ్చారు. [4] కొంకణ్ రైల్వే మార్గాన్ని నిర్మించడానికి భారతీయ రైల్వేలకు ఉన్న నిధుల కొరతను అధిగమించడానికి వారు, కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు.
ఆప్టా నుండి రోహా వరకు ఉన్న 60.75-కిలోమీటరు (37.75 మై.) విభాగం, కొంకణ్ రైల్వే లోని మొదటి దశ. ప్రణాళికా సంఘం దీన్ని ఆమోదించాక ఈ ప్రాజెక్టును 1978-79 బడ్జెట్‌లో ₹ 11190 కోట్ల అంచనా వ్యయంతో చేర్చారు. ఆప్టా నుండి మంగళూరు వరకు ఉన్న రైల్వే పొడవు 771.25 కిలోమీటర్లు (479.23 మై.). దీనికి అయ్యే ఖర్చు 1976 లో ₹ 2390 కోట్లుగా అంచనా వేసారు. [5] 1970 నుండి 1972 వరకు ఆప్టా నుండి మంగళూరు వరకు వెస్ట్ కోస్ట్ రైల్వే లైన్ కోసం ఇంజనీరింగ్, ట్రాఫిక్ సర్వే నిర్వహించారు. ఆప్తా-రోహా-దాస్‌గావ్ విభాగానికి సంబంధించిన తుది సర్వే 1974–75లో జరిగింది.
ఈ ప్రాజెక్టులో 2,116 వంతెనలు, 92 సొరంగాలు ఉన్నాయి (పన్వల్‌నాడి వంతెన, 2010 వరకు భారతదేశంలో కెల్లా అత్యంత ఎత్తైన వయాడక్ట్‌గా ఉండేది. ఇప్పుడు ఝజ్జర్ ఖాడ్ భారతదేశంలో ఎత్తైన వయాడక్ట్). [6] ఇది 20 వ శతాబ్దంలో ఆసియాలో కెల్లా అతిపెద్ద రైల్వే ప్రాజెక్టు. [7] దాదాపు 43,000 మంది భూయజమానుల నుంచి భూసేకరణ ప్రధాన సవాలుగా మారింది. తరతరాలుగా అనుభవిస్తున్న ఆస్తిని అప్పగించమని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ (KRCL) ప్రజలను అడగడం ప్రారంభించినప్పుడు, చాలా మంది (ప్రాజెక్టు ప్రాముఖ్యతను తెలుసుకున్నాక) స్వచ్ఛందంగా అప్పగించారు. దీంతో ఏడాదిలోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయగలిగారు. [8] అతి పొడవైన వంతెన 2.06 కి.మీ. (1.28 మై.) పొడవున శరావతి నదిపై ఉన్న వంతెన కాగా, అత్యంత పొడవైన సొరంగం రత్నగిరి సమీపంలోని కర్బుడేలో 6.561 కి.మీ. (4.08 మై.) పొడవున ఉంది .
నేల ఆకృతి, ప్రకృతి అంశాలు సవాలుగా నిలిచాయి; ఆకస్మిక వరదలు, వదులుగా ఉన్న మట్టి, కొండచరియలు విరిగిపడటం, సొరంగం కూలిపోవడం వంటివాటి వల్ల ప్రాజెక్టు పని దెబ్బతింది. దట్టమైన అడవుల్లో ఉన్న నిర్మాణ స్థలాల లోకి తరచూ అడవి జంతువులు వచ్చేవి. [9]
ఈ మార్గం మూడు రాష్ట్రాల గుండా (మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ) పోతుంది. ఇవన్నీ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాయి. అధీకృత వాటా మూలధనం 1996-1997లో ₹ 600 కోట్ల నుండి 800 కోట్లకు పెంచారు. అందులో భారత ప్రభుత్వం 51 శాతం వాటాను తీసుకోగా, మిగిలినవి మహారాష్ట్ర (22 శాతం), కర్నాటక (15 శాతం), కేరళ (6 శాతం), గోవా (6 శాతం)లు తీసుకున్నాయి.
ప్రాజెక్టు కాంట్రాక్టులను లార్సెన్ & టూబ్రో, గామన్ ఇండియా, ఆఫ్కాన్స్ లకు ఇచ్చారు. నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి, ప్రధాన వంతెనల కోసం అవసరమైన కాంక్రీటు స్తంభాలను నదీ తీరాల్లోనే పోతపోసి, తెప్పలపై జున్న క్రేన్‌లతో నిలబెట్టారు. [10] ఇది భారతదేశపు మొట్టమొదటి ఇంక్రిమెంటల్ లాంచ్ వంతెన నిర్మాణ పద్ధతి. [11] మెత్తటి నేల గుండా తవ్విన తొమ్మిది సొరంగాలు ప్రాజెక్టులో అతిపెద్ద సవాలుగా నిలిచాయి. వీటిని మానవికంగా చాలా నెమ్మదిగా నిర్మించారు. సంతృప్త మట్టి, అధిక నీటి మట్టం కారణంగా సొరంగ తవ్వకం కష్టమయ్యేది. సొరంగాలు అనేక సార్లు కూలిపోయాయి. చేసిన పనినే మళ్లీమళ్లీ చేయవలసి వచ్చింది. [12] సొరంగాల నిర్మాణంలో పంతొమ్మిది ప్రాణాలు, నాలుగు సంవత్సరాలు ఖర్చయ్యాయి. [12] మొత్తం రైలుమార్గ నిర్మాణంలో డెబ్బై నాలుగు మంది మరణించారు.
1993 మార్చిలో, దక్షిణ కొసన ఉన్న తోకూర్‌కు, కర్ణాటకలోనిఉడిపిల మధ్య గల 46-కిలోమీటరు (29 మై.) దూరం, అదే సంవత్సరం జూన్‌లో ఉత్తరాన మహారాష్ట్రలోని రోహా, వీర్‌ల మధ్య గల 47-కిలోమీటరు (29 మై.) పూర్తయ్యాయి. ఈ మార్గంలో మొదటి ప్యాసింజర్ రైలు 1993 మార్చి 20న మంగళూరు, ఉడిపిల మధ్య నడిచింది. 1995 మార్చిలో వీర్ నుండి ఖేడ్ వరకు (52 కి.మీ.), 1996 డిసెంబరులో ఖేడ్ నుండి సావంత్‌వాడి రోడ్డు వరకు, మరో 286 కిలోమీటర్లు (178 మై.) పొడిగించారు. 1995 జనవరిలో ఉడిపి నుండి కుందాపూర్ వరకు 38 కిలోమీటర్లు (24 మై.), 1997 ఆగస్టులో గోవాలోని పెర్నెమ్‌కి 272 కిలోమీటర్లు (169 మై.) పొడిగించారు.
పెర్నెం వద్ద తవ్విన సొరంగంలో పదేపదే కూలడం, వరదలు ముంచెత్తడం వంటి సమస్యల కారణంగా ముంబై, మంగళూరుల మధ్య రైలు సేవ నిలిచిపోయింది. సొరంగం నిర్మాణం ప్రారంభమైన ఆరు సంవత్సరాల తర్వాత 1998 జనవరిలో అది పూర్తయింది. 1998 జనవరి 26 న రోహా నుండి మంగళూరు వరకు ఉన్న పూర్తి రైలుమార్గం వినియోగంలోకి వచ్చింది [13] ముంబై, మంగళూరుల మధ్య పూర్తి మార్గంలో ప్రయాణీకుల సేవ 1998 మేలో [14] ప్రారంభమైంది.
756.25-కిలోమీటరు (469.91 మై.) ఉన్న మార్గంలో మొత్తం ట్రాక్ పొడవు 900 కిలోమీటర్లు (560 మై.) . మహారాష్ట్ర గుండా దీని పొడవు 361 కిలోమీటర్లు (224 మై.), కర్ణాటక గుండా 239 కిలోమీటర్లు (149 మై.), గోవాలో 156.25 కిలోమీటర్లు (97.09 మై.).
రైలు మార్గం ద్వారా ఇప్పటివరకు చేరుకోలేని ప్రాంతాలకు చేరుకోవడం వలన, పశ్చిమ, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణికులకు గణనీయమైన సమయం ఆదా కావడం వలనా ఈ మార్గం ప్రయాణీకుల ఆదరణ పొందింది. కొంకణ్ రైల్వేలో అనేక రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో మొదటిది ముంబై-మంగుళూరు నేత్రావతి ఎక్స్‌ప్రెస్ (తరువాత త్రివేండ్రం వరకు పొడిగించబడింది). దీన్ని 1998 మార్చి 1 న కొంకణ్ రైల్వేకు మళ్లించారు. దీని తర్వాత అదే సంవత్సరం ఏప్రిల్ 1న తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్ వచ్చింది. [15] లోకమాన్య తిలక్ టెర్మినస్ నుండి మంగళూరు వరకు నడిచే మత్స్యగంధ ఎక్స్‌ప్రెస్, , 1998 మే 1 న [16] సేవలను ప్రారంభించింది. హజ్రత్ నిజాముద్దీన్ -మంగళూరు మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్‌ను 1998 ఆగస్టు 1 న కొంకణ్ రైల్వే వైపు మళ్ళించి, ఎర్నాకులం జంక్షన్ వరకు పొడిగించారు. 1999 ఫిబ్రవరి 25 న పూణే -ఎర్నాకులం జంక్షన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టారు. జైపూర్, ఎర్నాకులం జంక్షన్ల మధ్య నడిచే మారుసాగర్ ఎక్స్‌ప్రెస్, కొంకణ్ రైల్వే ద్వారా అజ్మీర్ వరకు పొడిగించారు. దీన్ని 2001 అక్టోబరు 12 న [17] ప్రారంభించారు. భారతీయ రైల్వే 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2002 ఏప్రిల్ 16 న ముంబై, మడ్గావ్ల మధ్య జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించారు. [18][19] 2008 ఫిబ్రవరి 1 న, తిరువనంతపురంలోని కొచ్చువేలి రైల్వే స్టేషన్, లోకమాన్య తిలక్ టెర్మినస్ ల మధ్య గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రారంభించారు. [20]
తేజస్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన మొదటి సెమీ-హై-స్పీడ్, పూర్తిగా ఎయిర్ కండిషన్ చేసిన, ఆధునిక సౌకర్యాలతో ఉన్న రైళ్ళు. వీటిని దేశంలో తొలిసారి 2017 మే 24 న ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుండి గోవాలోని కర్మాలి రైల్వే స్టేషన్ వరకు నడిపారు.[21]
↑S. Vydhianathan. "Convergence on the Konkan Railway". Online edition of The Hindu, dated 2003-14-11. Archived from the original on 27 June 2006. Retrieved 2008-12-22.{{cite web}}: CS1 maint: unfit URL (link)