ఢిల్లీ ఒడంబడిక
భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల మధ్య 1973 ఆగస్టు 28 న కుదిరిన ఒప్పందమే ఢిల్లీ ఒడంబడిక. దీన్ని భారత పాకిస్తాన్‌లు మాత్రమే అంగీకరించి ధ్రువపరచాయి.[1] బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తరువాత పట్టుబడిన యుద్ధఖైదీలను, అధికారులను వెనక్కి పంపించేందుకు ఈ ఒడంబడిక తోడ్పడింది. బంగ్లాదేశ్‌లో ఉండిపోయిన, పాకిస్తాన్ వెళ్ళిపోవాలని కోరుకున్న వారిని తీసుకునేందుకు పాకిస్తాన్ నిరాకరించడం, 195 మంది పాకిస్తానీ యుద్ధ నేరస్థులపై విచారణ చేపట్టటాన్ని పాకిస్తాన్ అడ్డుకోవడం వంటి వాటి వల్ల ఈ ఒప్పందంపై విమర్శలు వచ్చాయి.[2]
సిమ్లా ఒప్పందం కుదిరిన తరువాత, భారత, పాక్, బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు.
నేపథ్యం
[మార్చు]1971 బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం వేలాది మంది బెంగాలీ అధికారులను వారి కుటుంబాలతో సహా పశ్చిమ పాకిస్తాన్‌లో ఖైదు చేసింది. బంగ్లాదేశ్‌లో ఉర్దూ మాట్లాడే ప్రజలు అనేక మంది పాకిస్తాన్‌కు వెళ్ళిపోవాలని కోరుకున్నారు. 1971 డిసెంబరు 16 న పాకిస్తాన్ భారతదేశానికి లొంగిపోవడంతో యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో భారత్ అనేక మందిపాక్ సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకుంది. 195 మంది అధికారులను కూడా ప్రవర్తన ఉల్లంఘనకు గాను బంధించింది.
పాకిస్తానీ యుద్ధ నేరస్థులపై బంగ్లాదేశ్ విచారణ చేపట్టేటట్లైతే, తాము బంధించి ఉంచిన బెంగాలీ అధికారులపై విచారణ జరుపుతామని పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ ఆలీ భుట్టో బెదిరించాడు.[3]
అమలు
[మార్చు]ఈ ఒప్పందం అమలు 1973 ఆగస్టు 8 న మొదలై, 1974 జూలై 1 న ముగిసింది. ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరుల పరస్పర మార్పిడి ఐక్యరాజ్యసమితి కాందిశీకుల హై కమిషనరు పర్యవేక్షణలో జరిగింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, 1,21,695 మంది బెంగాలీలు పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్‌కు తరలి వెళ్ళారు. వారిలో ఉన్నత స్థాయి పౌర, సైనిక అధికారులు ఉన్నారు. బంగ్లాదేశ్ నుండి 1,08,744 మంది బెంగాలీయేతరులు పాకిస్తాన్‌కు వెళ్ళారు.[4] భారత్ 6,500 మంది పాకిస్తానీ యుద్ధఖైదీలను విడుదల చేసింది.[5] 1974 లో జనరల్ నియాజీని విడుదల చెయ్యడంతో ఈ ప్రక్రియ ముగిసింది.[4]
పశ్చిమ పాకిస్తాన్‌లో స్థిరపడ్డ ఉర్దూ మాట్లాడే బీహారీలు ఎక్కువమంది తాము పాకిస్తాన్‌కు వెళ్ళిపోతామని కోరుకున్నారు. వాళ్ళను పాకిస్తాన్ స్వీకరించాలని ఒప్పందంలో ఉన్నప్పటికీ అమలు సమయానికి తాము ఇచ్చిన మాటను పాకిస్తాన్ పాటించలేదు.[6] దీంతో గుర్తింపుకు నోచుకోని పాకిస్తాన్ సమాజం ఒకటి బంగ్లాదేశ్‌లో ఉండిపోయింది.
యుద్ధ నేరస్థులు
[మార్చు]భారత్‌లో ఉన్న పాకిస్తానీ యుద్ధఖైదీల్లో 195 మంది అధికారులను అనుమానిత యుద్ధ నేరస్థులుగా గుర్తించారు. పాకిస్తాన్ తన డిమాండ్లలో ఒకటిగా వీరిని విడుదల చెయ్యాలని పట్టుబట్టింది. వీళ్లను విడుదల చేసేంతవరకూ బంగ్లాదేశ్‌ను గుర్తించవద్దని ముస్లిము దేశాలను పాకిస్తాన్ వత్తిడి చేసింది.[7] వీళ్ళను పాకిస్తాన్ పంపించెయ్యటానికి భారత్ మొగ్గుచూపింది. ఒప్పందంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి కమాల్ హోసేన్ ఇలా అన్నాడు:-
UN జనరల్ అసెంబ్లీ తీర్మానాలు, అంతర్జాతీయ చట్టం లోని సంబంధిత నిబంధనల ప్రకారం, ఆ యుద్ధ ఖైదీలు చేసిన మితిమీరిన చేష్టలు, వందలాది నేరాలు అన్నీ యుద్ధ నేరాల కింద, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, మారణహోమాల కీందకు వస్తాయి. అలాంటి నేరాలకు పాల్పడిన ఆ 195 మంది పాకిస్తానీ యుద్ధ ఖైదీల నేరాలకు గాను చట్టబద్ధమైన ప్రక్రియలో వారికి తగిన శిక్ష పడాలి అనే విషయమై సార్వత్రిక ఏకాభిప్రాయం ఉంది.[8]
యుద్ధ నేరస్థుల పై విచారణ జరపాలన్న బంగ్లాదేశ్ కోరికను పాకిస్తాన్ దాటవేసింది. అయితే, పాకిస్తాన్ ప్రతినిధి అజీజ్ అహ్మద్ మాత్రం.. తమ ప్రభుత్వం, "నేరాలు ఏమైనా జరిగి ఉంటే వాటి పట్ల తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నద"ని చెప్పాడు.[9][10]
పర్యవసానాలు
[మార్చు]ఈ ఒప్పందం అమలు కావడంతో పాకిస్తాన్ బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు ఏర్పడేందుకు ఆస్కారం ఏర్పడింది. 1974 లో ఇరుదేశాలూ దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాయి. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్ళిన అనేకమంది అధికారులు అక్కడ ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. బంగ్లాదేశ్ 9 వ అధ్యక్షుడు అబ్దుస్ సత్తార్ వారిలో ఒకరు. సైనికాధికారులు కూడా ఉన్నత పదవులను నిర్వహించారు.
పాకిస్తాన్ స్వీకరించేందుకు నిరాకరించగా బంగ్లాదేశ్‌లో ఉండిపోయిన పాకిస్తానీయుల అంశం ఇరుదేశాల సంబంధాల్లో ఒక ముఖ్యమైన వివాదంగా మిగిలిపోయింది.
మూలాలు
[మార్చు]- ↑ Levie, Howard S. (January 1974). "The Indo-Pakistani Agreement of August 28, 1973". American Journal of International Law. 68 (1). American Society of International Law: 95–97. JSTOR 2198806.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-03. Retrieved 2018-07-02.
- ↑ https://books.google.com.bd/books?id=zOMCYRmzLloC&q=zulfikar+ali+bhutto+bengali+trial&dq=zulfikar+ali+bhutto+bengali+trial&hl=en&sa=X&ved=0ahUKEwjYoKu5l9bJAhVBUY4KHU6ZAZMQ6AEIGjAA
- ↑ 4.0 4.1 UN. "Report of the United Nations High Commissioner for Refugees". UNCHR. UNCHR. Retrieved 16 February 2013.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-12-28. Retrieved 2018-07-02.
- ↑ Stanley Walpert (1993). Zulfi Bhutto of Pakistan:his life and times. Oxford University Press. ISBN 9780195076615.
- ↑ https://books.google.com.bd/books?id=z8OeAwAAQBAJ&dq=b+z+khasru+bangladesh+coup&hl=en&sa=X&ved=0ahUKEwiClKn1gMzJAhXBkY4KHUMXApcQ6AEIGjAA
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-12-28. Retrieved 2018-07-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-12-28. Retrieved 2018-07-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-03. Retrieved 2018-07-02.