రెండవ పులకేశి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ಬಾದಾಮಿ ಚಾಲುಕ್ಯರು
బాదామి చాళుక్యులు
Badami Chalukya
(543–753)
పులకేశి (543–566)
మొదటి కీర్తివర్మన్ (566–597)
మంగలేశ (597–609)
పులకేశి II (609–642)
విక్రమాదిత్య I (655–680)
వినయాదిత్య (680 -696)
విజయాదిత్య (696–733)
విక్రమాదిత్య II (733–746)
కీర్తివర్మ II (746–753)
దంతిదుర్గుడు
(రాష్ట్రకూటులు)
(735–756)

రెండవ పులకేశి (కన్నడ భాష : ಇಮ್ಮಡಿ ಪುಲಿಕೇಶಿ ) (సా.శ. 610 - 642 CE) చాళుక్యుల లో అత్యంత ప్రధానమైన రాజు. బాదామి చాళుక్యుల కాలంలో ఇతడు రాజైన తరువాత, దాదాపు దక్షిణ భారతం (దక్కను) అంతా ఇతడి ఆధీనంలోకి వచ్చింది.

చాళుక్య చక్రవర్తి మొదటి కీర్తివర్మను కుమారుడైన ఇతను తన పినతండ్రి మంగలేశను గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.

ప్రారంభపు జీవితం, రాజ్యసంక్రమణ

[మార్చు]

ఎరెయ్య, పట్టాభిషేకం సమయాన పులకేశి గా ప్రకటించుకున్నాడు, చాళుక్య రాజైన కీర్తివర్మన్ కుమారుడు. కీర్తివర్మన్ సా.శ. 597లో మరణించాడు, అప్పటికి ఎరెయ్య బాలుడే, కీర్తివర్మన్ తమ్ముడు మంగలేశ రాజ్యపగ్గాలు చేపట్టాడు. మంగలేశ రాజరికంలో ఆరితేరినవాడు, తన రాజ్యాన్ని బాగా విస్తరించాడు. ఎరెయ్య యుక్తవయస్కుడు కాగానే రాజ్యాన్ని పొందాలని ఆకాంక్షించాడు. కాని మంగలేశ, విశాల రాజ్యాన్ని యువరాజుకు ఇవ్వడానికి శంకించాడు. తానే రాజ్యాన్ని ఏలాలని నిశ్చయించాడు, తన తరువాత తన కుమారుడిని యువరాజుగా ప్రకటించాడు. ఎరెయ్య, కోలారు లోని బాన ప్రాంతంలో ఆశ్రయం పొంది, అక్కడ సైన్యాన్ని పోగుచేయడం ప్రారంభించాడు. తన పినతండ్రిపై యుద్ధాన్ని ప్రకటించాడు. పెద్దవడుగూరు శిలాశాసనాల ప్రకారం, మంగలేశుడు ఎలపట్టు యుద్ధంలో చంపబడ్డాడు, ఎరెయ్య విజయుడయ్యాడు. ఎరెయ్య సింహాసనాన్ని అధిష్టించి "పులకేశి 2"గా మార్చుకొని "చాళుక్య పరమేశ్వర" అనే బిరుదును ఆపాదించుకున్నాడు.

స్థిరీకరణ

[మార్చు]

రాజుగా ప్రమాణం చేసిన తరువాత, పులకేశి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నాడు. తన రాజ్యంలోని అంతర్యుద్ధాలు, తనకు ఎంతో తోడ్పాటునందించాయి, చాళుక్యులతో విభేదించే చాలా వర్గాలు పులకేశికి దగ్గరయ్యాయి. 634 నాటి ఐహోలు శిలాశాసనాలలో ఇలా వ్రాసివుంది, "శత్రువుల ప్రపంచమంతా అంధకారంలో చుట్టబడినది". మంగలేశుడి మిత్రులైన అప్పాయిక, గోవింద లను ఎదుర్కొన్నాడు. భీమానది ఒడ్డున వీరితో పోరాడాడు, గోవింద లొంగిపోగా, అప్పాయిక యుద్ధభూమి నుండి పారిపోయాడు.

విస్తరణ

[మార్చు]
రెండవ పులకేశి సా.శ. 640 కాలంలో చాళుక్యుల రాజ్యప్రాంతాలు.

తన స్థానాన్ని స్థిరం చేసుకుని పులకేశి, తన సైనిక బలగాలను పెంచుకున్నాడు. తన రాజ్యప్రాంతాలను విశాలీకరించడానికి పూనుకున్నాడు. ఈ విషయాలు సా.శ. 634 కాలంనాటి "ఐహోలు శిలా శాసనాల"లో వర్ణించబడ్డాయి. ఈ శాసనాలు, పులకేశి ఆస్థానకవియైన రవికీర్తి వ్రాశాడు. ఇందులో రవికీర్తి కవితలు కూడా కానవస్తాయి. ఈ శిలాశాసనాలు సంస్కృతభాష, కన్నడభాష లిపియైన "హాలె"లో వ్రాయబడ్డాయి. ఈ శిలాశాసనాలు రెండవ పులకేశి రాజ్యానికి చెందిన అనేక విషయాలకు ప్రాథమిక వనరులు.

పశ్చిమాన దండయాత్రలు

[మార్చు]

బనవాసికి చెందిన కదంబులకు, తలకాడు కు చెందిన గంగాలకు దక్షిణ కనరాకు చెందిన అలుపా లను అణచివేశాడు. కొంకణ్ కు చెందిన మౌర్యులను ఓడించాడు. పూరీ రేవు (నవీన ఎలిఫెంటా దీవులు) ను స్వాధీన పరచుకున్నాడు. లాతాలు గుర్జారాలు, మాళవాలపై ఆక్రమణలు చేశాడు. తద్వారా తన రాజ్యాన్ని గుజరాత్ వరకు విస్తరించాడు. (చరిత్రకారులు:Dr. R.C. Majumdar and Dr. Sircar.) గంగారాజ్యానికి చెందిన పాలకుడు దుర్వినిత తన కుమార్తెకు పులకేశికిచ్చి ఇచ్చి వివాహం చేశాడు. వీరి సంతానం మొదటి విక్రమాదిత్యుడు.

తూర్పు దక్కను

[మార్చు]

పాండువంశీయులు పాలించే కోసలను జయించాడు. తూర్పు గంగకు చెందిన కళింగ, పిఠాపురం కోటలను జయించాడు. విష్ణుకుండినులను అణచివేశాడు, వేంగి ప్రాంతాలకు చెందిన కూనాల ప్రాంతాలనూ జయించాడు. జయించిన తూర్పు ప్రాంతాలకు అధిపతిగా తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడుని నియమించాడు (ఇతడికి బిట్టసారుడు అనికూడా పేరు కలదు) (631). ఈ విష్ణువర్ధనుడు తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

దక్షిణాది దండయాత్రలు

[మార్చు]

దక్షిణాన తన జైత్రయాత్రను కొనసాగిస్తూ పులకేశి పల్లవుల రాజైన మహేంద్రవర్మన్ 1ను పుల్లలూర్ యుద్ధంలో ఓడించాడు. ఈ పుల్లలూర్, పల్లవుల రాజధానికి కేవలం 25 కి.మీ.దూరంలో వుండినది. ఘోరయుద్ధం జరిగింది. మహేంద్రవర్మన్ తన రాజధానిని రక్షించుకున్ననూ అనేక ప్రాంతాలను కోల్పోవలసి వచ్చింది. పులకేశికి పశ్చిమం నుండి గంగైరాజు దుర్వినిత దక్షిణం నుండి పాండ్యరాజు జయంతి వర్మన్ సహాయపడ్డారు. పల్లవుల రాజధాని కాంచీపురం జయించిననూ, పూర్తిగా పల్లవరాజ్యాన్ని పొందలేకపోయాడు. ఈ ప్రాంతాలను జయించి, పులకేశి తిరుగుప్రయాణమయ్యాడు.

దక్షిణభారతదేశ చరిత్రలో ఇంతపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత రెండవ పులకేశికే దక్కుతుందని ప్రొఫెసర్ నీలకంఠశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

హర్షవర్ధనుడితో యుద్ధాలు

[మార్చు]

పులకేశి తన దండయాత్రలను ఉత్తర దిక్కున నర్మదా నది వైపున మరల్చినపుడు, కనౌజ్ రాజైన హర్షవర్ధనుడితో ముఖాముఖి యుద్ధాలు చేయవలసివచ్చింది. హర్షవర్ధనుడి బిరుదు ఉతరపథేశ్వర. వీరివురి మధ్య నర్మదా నది వద్ద ఘోరయుద్ధం జరిగింది. హర్షవర్ధనుడు అనేక ప్రాంతాలను కోల్పోవలసి వచ్చింది. ఐహోలు శిలాశాసనాల ద్వారా తెలిసిందేమంటే, హర్షవర్ధనుడు తన హర్షాన్ని (సంతోషాన్ని) కోల్పోవలసి వచ్చింది. నర్మదానది వీరివురి రాజ్యాలకు సరిహద్దుగా మారినది. చైనా యాత్రికుడు హువాన్‌త్సాంగ్ ప్రకారం: "శిలాదిత్యరాజు (హర్షవర్ధనుడు) కృతనిశ్చయంతో పులకేశిని నిలువరించడానికి ప్రయత్నించాడు. కానీ, అతడిపై అధిపత్యాన్ని పొందలేదు, అణగద్రొక్కలేకనూ పోయాడు".

ఈ విజయంతో చాళుక్య రారాజయ్యాడు. పరమేశ్వర, సత్యశ్రాయ, పృథ్వీవల్లభ లాంటి బిరుదులు పొందాడు. దక్షిణభారతాన్నంతటినీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ లోని అనేక ప్రాంతాలు, గు తన రాజ్యంలో కలుపుకున్నట్లయినది. ఈ విజయాలతో ఇతను "దక్షిణపథేశ్వర" బిరుదులు పొందాడు. ఈ సంఘటనలన్నీ సా.శ. 630, 634 ల మధ్య జరిగినవి. పులకేశి, దక్షిణ కెనరాకు చెందిన అలూప రాజ్య రాకుమారిని వివాహమాడాడు.

ఓటములు

[మార్చు]

తన ఆఖరి కాలంలో పులకేశి ఎన్నో ఓటములు చవిచూశాడు. పల్లవులతో జరిగిన యుద్ధాలలో కొన్ని నిలువరింపులు చేసిననూ పల్లవసేనలు మొదటి నరసింహవర్మన్ ఆధ్వర్యంలోని సేనలు పులకేశిని ఓడించాయి. మొదటి నరసింహవర్మన్ వాతాపి (బాదామి) ని ఆక్రమించాడు, రాజుగా ప్రకటించుకుని, "వాతాపికొండ" అనే బిరుదు ఆపాదించుకున్నాడు.

పులకేశి మరణము

[మార్చు]

పల్లవులతో యుద్ధం సమయంలో పులకేశి ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరువాత 13 సంవత్సరాలు బాదామి రాజ్యం పల్లవుల హస్తగతమైంది.

పులకేశి పర్షియా రాజు, షాహ్ ఖుస్రో 2తో రాయబారాలు సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ విషయం అజంతా చిత్రాలలో కానవస్తుంది. చైనా యాత్రికుడు హువాన్‌త్సాంగ్ పులకేశి, అతడి రాజ్యం గురించి పొగిడాడు.

దక్షిణభారతంలో బంగారు నాణెములను ప్రవేశపెట్టిన మొదటివాడు పులకేశి. ఇతడి నాణెములలో వరాహపు బొమ్మలు వుండేవి. ఈ బొమ్మలు రాజరికపు చిహ్నాలుగా వుండేవి. అందుకే ఈ నాణెములకు 'వరహాలు' అని పేరు వచ్చింది. పులకేశికి ఐదుగురు కుమారులు, చంద్రాదిత్య, ఆదిత్యవర్మ, విక్రమాదిత్య, జయసింహ, అంబేరా. పులకేశి మరణం తరువాత, వీరు తమలో తాము పోట్లాడుకుని రాజ్యభూభాగాలను పంచుకున్నారు. పులకేశి మూడవ కుమారుడు విక్రమాదిత్య 1 642లో తన అన్నదమ్ములను ఓడించి రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుని, బాదామి రాజ్యాన్ని ఏకీకరణ చేశాడు.

మూలాలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]